గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ అయిన ఘటన మరువక ముందే.. మరో కీలక నేతను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని జనగూడకు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బోయిపరిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని పెటగూడ గ్రామ సమీపంలోని అడవుల్లో హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్కా సమాచారం అందడంతోనే.. పోలీసులు అక్కడ కూంబింగ్ నిర్వహించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్ సమయంలో పోలీసులు హిడ్మా నుండి ఏకే 47 తో సహా పెద్ద మొత్తంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన సామాగ్రిని ఇతర కీలకమైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.