– డిజిటల్ అరెస్టు ఉచ్చులో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్
– కోటి రూపాయలకు పైగా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేస్తున్నారు. తాజాగా అనంతపురంలో ఓ రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నారు. అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు మేనేజరుగా పని చేస్తూ రిటైర్ అయ్యారు. అతని వద్ద పెద్ద భారీగా డబ్బులు ఉంటాయని గుర్తించిన మోసగాళ్లు, సొమ్ము కొట్టేసేందుకు ప్లాన్ వేశారు.
సదరు వ్యక్తికి ఇటీవల ఓ వ్యక్తి నుంచి వాట్సప్ కాల్ వచ్చింది. తాను సీఐడీ అధికారినని మనీ లాండరింగ్‌కు సంబంధించి కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారు మీ పేరును చెప్పారని, అందులో మీ పాత్ర కూడా ఉందంటూ భయపెట్టారు. అతని ఆధార్ కార్డు నంబర్ సైతం చెప్పారు. దీంతో భయపడిన ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేయడానికి ఒప్పుకున్నాడు. కేసు నుంచి తప్పించడానికి పై అధికారులకు కొంత మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ నమ్మబలికారు. ఇలా నలుగురు వ్యక్తులు వివిధ పేర్లతో మాట్లాడుతూ భయపెట్టారు. పలు దఫాలుగా రూ.1.04 కోట్లు మోసగాళ్ల అకౌంట్లలోకి వేశాడు. తరువాత వారికి ఫోన్‌లు చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మన భయమే వారికి బలం: మన బలహీనత, భయమే సైబర్ నేరగాళ్లకు బలంగా మారుతోంది. నమ్మించేందుకు మన వ్యక్తిగత వివరాలు చెప్తుంటారు. తర్వాత బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బు బదిలీ చేయాలంటూ ఒత్తిడి తెస్తారు. క్రమేణా వారి ఉచ్చులోపడి డబ్బంతా పోగొట్టుకోవడం మనవంతవుతోంది. కొన్నాళ్లుగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి చాలామంది మోసపోయారు.
ప్రభుత్వ రంగ సంస్థలు, గుర్తింపు ఉన్న ఏజెన్సీలు డబ్బు పంపాలంటూ మీపై ఒత్తిడి తీసుకురావు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. నేరగాళ్లు మనల్ని మోసం చేయడానికే ఆయా సంస్థల లోగోలు చూపుతారు. అటువంటి ఫోన్ వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచించండి. బ్యాంక్ కేవైసీ అప్‌డేట్, ఫోన్ పే లింక్, ఏపీకే ఫైల్ వంటివి పంపి వాటిపై క్లిక్ చేయమని చెప్తారు. క్లిక్ చేయగానే మన ఖాతాలో ఉన్న డబ్బంతా మాయమవుతుందనే విషయం తెలుసుకోవాలి.