73 ఏళ్ల మహిళ గర్భంలో 30 ఏళ్లుగా కల్సిఫైడ్ ఫీటస్ (రాతి బిడ్డ) ఉన్నట్లు గుర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అరుదైన పరిస్థితిని లిథోపీడియాన్ అని పిలుస్తారు. ఇందుకు సంబంధించిన సీటీ స్కాన్ చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ఘటన అల్జీరియాలో జరిగినట్లు తెలుస్తోంది.
లిథోపీడియాన్ అనేది చాలా అరుదుగా కనిపించే వైద్య పరిస్థితి. గర్భం గర్భాశయం బదులు కడుపులో ఏర్పడితే.. దానికి తగిన రక్త సరఫరా లేకపోవడం వల్ల గర్భం విఫలమవుతుంది. అయితే శరీరానికి ఫీటస్‌ను సహజంగా బయటకు పంపే మార్గం లేకపోతే.. శరీరం రక్షణాత్మక చర్యగా ఫీటస్‌ను శిలాజంగా మార్చేస్తుంది. మన బాడీలోని రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. శరీరానికి ప్రమాదకరమైన అంశాల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా భాడీ ఈ ప్రాసెస్ చేపడుతుంది.
2013లో కూడా కొలంబియాలో 82 ఏళ్ల మహిళకు 40 ఏళ్ల క్రితం గర్భం విఫలమై, ఆ ఫీటస్ శరీరంలోనే రాతిగా మారిపోయినట్లు గుర్తించారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 సార్లు మాత్రమే నమోదయినట్లు మెడికల్ డేటా చెబుతోంది. ‘ఇంతకాలం ఆ మహిళకు ఎలాంటి ఇబ్బంది కలగలేదా?’, ‘ఇది నిజమా? ఎలా సాధ్యం?’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.