వైద్య విద్యకు కొలువుల కళ. తెలంగాణ లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్ ఒప్పంద, పొరుగుసేవల వైద్యులకు 20 శాతం వెయిటేజీ.
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ)పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సహాయ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్యనియామక బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. వైద్య విద్యలో నాణ్యత పెంచడానికి, బోధనాసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో మల్టీజోన్-1, 2 కలిపి వివిధ విభాగాల్లో మొత్తం 607 పోస్టులను భర్తీ చేయనుంది. రెండు రోజుల క్రితం 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ప్రకటన ఇచ్చిన ప్రభుత్వం… తాజాగా 607 పోస్టులతో ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 10 నుంచి 17 సాయంత్రం 5 గంటల్లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బోర్డు మెంబర్ సెక్రటరీ తెలిపారు.
దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు, సవరణలు ఉంటే జులై 18 నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ అవకాశమిస్తామని వివరించారు. అభ్యర్థులకు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు అర్హత ఉంటే.. వేర్వేరుగా దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. మొత్తం 34 స్పెషాలిటీల్లో మల్టీజోన్ 1లో 379, మల్టీజోన్ 2లో 228 పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు ఉన్నాయి. ఆ తరువాత జనరల్ మెడిసిన్‌లో 47 ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికైన అభ్యర్థులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి వీల్లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 2025 జులై 1 నాటికి 46 ఏళ్లు ఉండాలని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపును ప్రభుత్వం ఇచ్చింది.
♦ఒప్పంద, కాంట్రాక్టు వైద్యులకు 20శాతం వెయిటేజీ
రాష్ట్రంలో వైద్య నియామక మండలి తాజాగా జారీ చేసిన 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు, శనివారం జారీ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ ప్రకటనల్లో ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యశాలలు తదితర చోట్ల పొరుగుసేవలు, ఒప్పంద విధానంలో పనిచేస్తున్న వైద్యులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చింది. మొత్తం 100 పాయింట్ల స్కోరు విధానంలో అకడమిక్ మార్కులకు 80శాతం, పొరుగుసేవలు, ఒప్పంద పద్ధతిలో పనిచేసిన కాలానికి 20 శాతం వెయిటేజీ చొప్పున కేటాయిస్తూ మెరిట్ జాబితా ఇవ్వనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తే ప్రతి ఆరునెలల కాలానికి 2.5 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తుంది..