మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. పోలీసుల నోటీసులు

గోల్డెన్ న్యూస్/ మేడ్చల్ : కొంపల్లిలో మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి కుమారుడు సీహెచ్ భద్రారెడ్డి రాజభవనంపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు ఇవాళ (గురువారం, జులై24) సోదాలు నిర్వహించినట్లు వదంతులు గుప్పుమన్నాయి. మల్లారెడ్డి హాస్పిటల్స్, సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఆర్థిక లావాదేవీలను పరిశీలించినట్లు ప్రచారం జరిగింది. అనుమానాస్పదంగా భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరగడంతో ఐటీ అధికారులు సోదాలు చేశారనే పుకార్లు వచ్చాయి. ఈ మేరకు మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ భద్రారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిట్లు జోరుగా ప్రచారం జరిగింది.

 

ఆన్‌లైన్, నగదు రూపంలో ఇటీవల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి భద్రారెడ్డి, కుటుంబ సభ్యులను ఐటీ అధికారులు ప్రశ్నించారని వదంతులు వచ్చాయి. ఈ సోదాల్లో ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిని ఇంట్లోనే ఉండాలని సూచించినట్లు పుకార్లు వ్యాపించాయి. కాగా గతంలోనూ ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సోదాలు నిర్వహించి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారని వదంతులు వ్యాపించాయి.

 

ముఖ్యంగా రెండ్రోజుల క్రితం భద్రారెడ్డి భార్య ప్రీతిరెడ్డి.. హైదరాబాద్‌లో బీజేపీ నాయకులను కలిశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆమె సహచరులు, బీజేపీ నాయకులు చిత్రీకరించిన బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలని ప్రీతిరెడ్డి కలిసిన క్రమంలో ఐటీ సోదాలు అని వదంతులు వ్యాపించడం చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాల జరిగాయని ప్రచారం జరగడంపై ఆయన కోడలు ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాళోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో వరంగల్ పోలీసులు ఇక్కడకి వచ్చారని ప్రీతిరెడ్డి తెలిపారు.

 

 మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఏమన్నారంటే..

 

మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాలు జరిగాయని ప్రచారం జరగడంపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి స్పందించారు. ఐటీ అధికారులు తమ ఇళ్లపై సోదాలు చేస్తున్నారనే విషయంలో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. 2022లో పీజీ సీట్ల విషయంలో కాళోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో వరంగల్ పోలీసులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా నోటీసులు అందజేశారని తెలిపారు. ఉదయం 6 గంటలకు అధికారులు రావడంతో ఐటీ అధికారులుగా కొందరు ప్రచారం చేస్తున్నారని ఇందులో వాస్తవం లేదని మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పేర్కొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram