బీసీలను భ్రమ పెట్టేందుకు ఉత్తుత్తి ధర్నాలు: ఎమ్మెల్సీ కవిత

గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : బీసీల రిజర్వేషన్ల బిల్లు గురించి ప్రజలను భ్రమ పెట్టేందుకే దిల్లీలో కాంగ్రెస్‌ ధర్నా పేరుతో నాటకాలాడుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

 

సామాజిక తెలంగాణ అంటే దిల్లీకి వెళ్లి వట్టిగా ధర్నాలు చేయడం కాదన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో జాగృతి జెండాను ఆమె బుధవారం ఆవిష్కరించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.

 

బీసీలకు ఇచ్చే 42 శాతం రిజర్వేషన్‌లో ముస్లింలు ఉండవద్దని ముందునుంచి బండి సంజయ్‌ మాట్లాడుతునే ఉన్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ బీసీలను మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్క పార్టీతో జై తెలంగాణ అనిపించామని గుర్తుచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. బీసీల కోసం తాము హైదరాబాద్‌లో 72గంటలపాటు దీక్షకు పూనుకుంటే కోర్టు నుంచి అనుమతి రాలేదని తెలిపారు.

 

కాంగ్రెస్‌ నాయకులు దిల్లీలో దొంగ దీక్షలు చేయడం కాదు.. నిజమైన దీక్షలు చేయాలని హితవు పలికారు. జాగృతిలోకి వచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని.. తమకు అన్ని వర్గాల మద్దతు లభిస్తోందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

 

బీసీల కోసం కాంగ్రెస్‌, బీజేపీలు చిత్తశుద్ధితో పనిచేయటం లేదని మండిపడ్డారు. బీసీల కోసం జాగృతి కార్యచరణ సిద్ధం చేస్తుందని ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్లపై బండి సంజయ్‌ మాట్లాడడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్‌లపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ తీసుకొని అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకొని వెళ్లాలనీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు.

 

తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌ చెప్పినట్లుగా వారి బాటలో తెలంగాణ జాగృతి ముందుకు వెళ్లిందని ఉద్ఘాటించారు. జయశంకర్‌ సార్‌ ఆలోచనలను తు.చ తప్పకుండా పాటించామని చెప్పుకొచ్చారు. తెలంగాణ చూడకుండానే ఆయన దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జయంతి సందర్భంగా జాగృతి ఫౌండేషన్‌ డే జరుపుకుంటున్నామని తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలని జయశంకర్‌ సార్‌ అనేకసార్లు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలని జయశంకర్‌ సార్‌ చెప్పేవారని పేర్కొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram