ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో కార్మికుల ఉపాధిని దెబ్బతీయవద్దు

   మెడకు ఉరి తాళ్ళు బిగించుకుని నిరసన

గోల్డెన్ న్యూస్ / శ్రీకాకుళం : ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోకు భూములిచ్చిన దళిత కార్మికుల పొట్టకొట్టవద్దని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుతూ ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గత 11 రోజులుగా ఆందోళన చేస్తున్న హమాలీలు 12వ రోజు శనివారం మెడకు ఉరి తాళ్ళు బిగించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఎచ్చెర్ల గ్రామంలో దళిత కుటుంబాలు నుండి జాతీయ రహదారి ప్రక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే 4 ఎకరాలు భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పిస్తామ‌ని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఎచ్చెర్లలో బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రభుత్వం భూములిచ్చిన దళిత కుటుంబాలకు చెందిన కార్మికులుగా, హమాలీలుగా 80మంది లోడింగ్, అన్ లోడింగ్ పనులు పనిచేస్తూ రోజు వారీ వచ్చే ఆదాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక డిపో ద్వారా కొనసాగుతున్న దాన్ని నేడు జిల్లా నుండి 8 మండలాలు ప్రక్క జిల్లాలకు వెళ్ళినా కూడా డిపో విడగొట్టి ఇప్పుడు కొత్తగా టెక్కలిలో మరో డిపో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమోచ్చిందో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసారు. ఎచ్చెర్లలో ప్రభుత్వ సొంత గోడౌన్ ద్వారా మద్యం సరఫరా చేస్తుంటే అదనంగా టెక్కలిలో మరో ప్రైవేట్ గోడౌన్ అద్దెకు తీసుకొని ఎర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేది:08.07.2025న ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని విమర్శించారు. దీని వలన టెక్కలిలో గోడౌన్ కు ప్రభుత్వం అద్దె చెల్లించాలని, అదనపు సిబ్బందిని నియమించాలని నెలకు లక్షలాది రూపాయలు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అన్నారు. మరో వైపున ఎచ్చెర్ల డిపో పైనే ఆధారపడిన ఉపాధి పొందుతున్న 80 దళిత, పేద కుటుంబాలకు చెందిన హమాలీలకు తగినంత ఆదాయం లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కింజరాపు.అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖా మంత్రిగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తికి, పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి గానీ భూములిచ్చిన కార్మికుల ఉపాధి దెబ్బతీసేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేసారు. ఎచ్చెర్ల ఐయంఎల్ డిపోను విడదీసి టెక్కలి మండలం తిర్లంగి గ్రామంలో అదనంగా మరో మద్యం డిపో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే రద్దు చేసి ఎచ్చెర్ల డిపోను యధావిధిగా కొనసాగించి దళితులు,పేదలుగా ఉన్న హమాలీల ఉపాధిని కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో హమాలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.బంగార్రాజు నాయకులు టి.రామారావు, ఎన్.సురేష్, ఎన్.రమణ, బోనెల.రాము, పి.రామారావు, ఎల్.సీతారాం, ముద్దాడ.రాజు, కె.వి రమణ, ఎస్.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram