బంగారం ధర రోజు రోజు కు పైపైకి ఎగబాకుతూ .. ప్రజలను కంగారుపెడుతుంటే… మరోపక్క చెత్త తిని- 24 క్యారెట్ల బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియాని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఈ బ్యాక్టీరియా పేరు ‘కుప్రియోవిడస్ మెటాలీడ్యూరన్స్’. సైంటిస్టులు ముద్దుగా ‘గోల్డ్ పూపింగ్ బ్యాక్టీరియా’ అంటున్నారు. రాగి, ఇతర లోహాలు కలిసిన బంగారం, నికెల్ వంటి వాటిని తిన్నప్పుడు… తన జీర్ణవ్యవస్థలో విడుదలైన ప్రత్యేక ఎంజైముల సాయంతో వాటిని 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంగా మార్చి విసర్జిస్తుందీ బ్యాక్టీరియా. ఇదేదో బాగానే ఉంది… ఆ బ్యాక్టీరియాని పెంచుకుని బంగారాన్ని పోగేసుకుంటే పోలా అనుకుంటున్నారు కదూ!
కానీ… కంటికే కనిపించని ఈ బ్యాక్టీరియా తాలూకు విసర్జితాలు నానోపార్టికల్స్ పరిమాణంలో ఉండి అసలే కనిపించవు. అలాగని నిరాశ పడాల్సిన అవసరం లేదు… బంగారు గనులు ఉండే చోట- భారలోహాలతో కలుషితమైన నేలని శుభ్రం చేయడానికి ‘బయో మైనింగ్’ పేరుతో ఈ బ్యాక్టీరియాని ఉపయోగించి భూమి కాలుష్యాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారట.









