గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : ఉచిత బస్సు పథకం లబ్ది దారులకు అలర్ట్. అప్‌డేటెడ్ ఆధార్ కార్డ్ ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణం అంటూ బోర్డు పెట్టింది ఆర్టీసీ యాజమాన్యం. ఉమ్మడి రాష్ట్రంలో పొందిన ఆధార్ కార్డుతో ఉచిత బస్సు ప్రయాణం ఉండదని బస్సుల్లో దర్శనమిస్తున్నాయి నోటీసులు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డులో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనే ఉండడంతో జీరో టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు కండక్టర్లు. ఆధార్ కార్డు అప్‌డేటెడ్ ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంటుందని బస్సులో నోటీసులు దర్శనమిస్తున్నాయి . ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకునేందుకు ఆధార్ కేంద్రాలకు, మీసేవ కేంద్రాలకు పోటెత్తున్నారు మహిళలు. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఉన్నత అధికారులు చెబుతున్నారు.
ఆధార్ సవరణ కేంద్రాలకు ఉన్నట్టుండి మహిళలు క్యూ కడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డుల్లో ఇంటి చిరునామాలో ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణ అని మార్చుకుంటున్నారు. కొందరు ఫొటోలను అప్‌డేట్ చేసుకుంటున్నారు. మీసేవ కేంద్రాలు, పోస్టాఫీస్ ఆధార్ సెంటర్లు, ఆధార్ సవరణ కేంద్రాలు.. ఇలా ఎక్కడ వీలుంటే అక్కడ ఆధార్ కార్డులను సవరించుకునేందుకు మహిళలు పోటెత్తుతున్నారు.
మహేశ్వరం సమీపంలోని ఓ కాలనీకి చెందిన మహిళ తుక్కుగూడ నుంచి చాంద్రాయణగుట్ట వెళ్లేందుకు మహేశ్వరం డిపో బస్సు ఎక్కారు. ఆధార్ కార్డులో తెలంగాణ బదులు ఏపీ అని ఉండటంతో జీరో టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ నిరాకరించారు. చేసేది లేక రూ.25 టికెట్ కొని ప్రయాణించాల్సి వచ్చింది. ‘దీనిపై మహేశ్వరం డిపో అధికారులకు ఫిర్యాదు చేస్తే, చిరునామాలో తెలంగాణ బదులు ఏపీ అని ఉంటే ఉచిత ప్రయాణానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు’అని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం బూర్గంపహాడ్ ఇంటి చిరునామా ఉన్న ఆధార్‌కార్డుతో ఓ మహిళ నగరంలోని మెహిదీపట్నంలో బస్కెక్కగా, కండక్టర్ ఉచిత ప్రయాణానికి అనుమతించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్‌కార్డు కావటంతో దానిపై తెలంగాణ బదులు ఆంధ్రప్రదేశ్ అని ఉండటమే కారణం. దీంతో ఆ మహిళ ఆ బస్సు దిగి మరో బస్సు ఎక్కాల్సి వచ్చింది.ఇలా నిత్యం కొన్ని ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు జీరో టికెట్లను నిరాకరిస్తుండటంతో ఇప్పుడు అలజడి రేగింది. కొన్ని బస్సుల్లో కండక్టర్లు నోటీసులు అతికించి మరి ఆధార్ కార్డులను అప్‌డేట్ చేయించుకోవాలని, లేని పక్షంలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని రాసి ఉన్న సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు.
ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన కొత్తలో మాత్రం రెండుమూడు పర్యాయాలు, ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోవాలన్న ప్రకటన వెలువడిందని, ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ, ఒకరిని చూసి మరొకరుగా ఆధార్ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే అనుమతించడం లేదు. కొందరు టికెట్ చెకింగ్ సిబ్బంది కూడా తెలంగాణ అని లేకపోతే తప్పుపడుతున్న సందర్భాలూ ఉన్నాయి.









