నేటి నుంచి 11 డిపోల్లో అమలు
దశలవారీగా అన్ని డిపోల్లోనూ నిషేధం.
గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : బస్సు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవర్లు విధి నిర్వహణలో ఉండగా సెల్‌ఫోన్లను వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని సంస్థ భావిస్తోంది. ఈ కొత్త నిబంధన నేటి నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలులోకి రానుంది. డ్యూటీలో చేరేముందు డ్రైవర్లు తమ సెల్‌ఫోన్‌లను స్విచ్ఛాఫ్ చేసి, డిపోలోని సెక్యూరిటీ ఆఫీసర్ లేదా కార్యాలయంలో డిపాజిట్ చేయాలి. విధులు ముగించుకున్న తర్వాత డ్రైవర్లు తమ ఫోన్‌లను తిరిగి తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్‌కు సమాచారం అందించడానికి డిపోలో ప్రత్యేకంగా ఒక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ నంబర్‌కు కాల్ చేస్తే, ఆ సమాచారాన్ని బస్సు కండక్టర్ ద్వారా డ్రైవర్‌కు చేరవేస్తారు.
మొదటి దశలో రాష్ట్రంలోని 11 రీజియన్ల నుంచి ఒక్కో డిపోను ఈ పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. సికింద్రాబాద్ రీజియన్‌లో కూకట్‌పల్లి, హైదరాబాద్ రీజియన్‌లో ఫరూక్‌నగర్, రంగారెడ్డి: వికారాబాద్, ఆదిలాబాద్: ఉట్నూర్, కరీంనగర్: జగిత్యాల, మహబూబ్‌నగర్: కొల్లాపూర్, మెదక్: సంగారెడ్డి, నల్గొండ: మిర్యాలగూడ, ఖమ్మం రీజియన్‌లో ఖమ్మం, నిజామాబాద్: కామారెడ్డి, వరంగల్: పరకాల డిపోల్లో సెల్‌ఫోన్లను నిషేధించారు. ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా నిబంధనను దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లోనూ అమలు చేయాలని TGSRTC ప్రణాళిక వేసింది. ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమేనని సంస్థ అధికారులు తెలిపారు.









