మీపై కేసు నమోదైంది.. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. అంటే భయపడకండి.

చైనా ముఠాలు కంబోడియా, లావోస్, మయన్మార్లతో కూడిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’ ప్రాంతంలో ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయి.

 

భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీవోఐపీ)లతో కూడిన ‘సిమ్బాక్స్’ సెటప్లను అక్రమంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు ఈ సెటప్ ల ద్వారా లోకల్ కాల్స్ గా మార్చుతూ.. సీబీఐ, ఈడీ, ముంబయి పోలీస్ తదితర దర్యాప్తు సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నట్లు.. మీపై కేసు నమోదైనట్లు, డిజిటల్ అరెస్ట్ చేసినట్లు బెదిరిస్తున్నాయి.

 

చర్యలు తీసుకోకుండా ఉండాలంటే.. వెంటనే రూ. లక్షలు పంపండి అంటూ డిమాండ్ చేస్తున్నాయి. పెట్టుబడులపై అధిక లాభాల పేరుతోనూ సైబర్ మోసగాళ్లు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. ఈ మోసాలన్నీ విదేశాల నుంచే జరుగుతున్నాయి.

 

ఇలా మీ సెల్ ఫోన్ కు భారత్ నంబర్ తోనే అంతర్జాతీయ కాల్స్ వస్తుంటే.. అవి ముమ్మాటికీ సైబర్ నేరస్థుల పనేనని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) స్పష్టం చేస్తోంది.

 

అలాంటప్పుడు వెంటనే ‘రిక్విన్ (రిపోర్ట్ ఇన్ కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్)’కు ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది.

 

ఎలా గుర్తించాలి..?

 

గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి వచ్చే ఫోన్ కాల్ సెల్ ఫోన్ స్క్రీన్ పై ‘అన్ నోన్ నంబర్’ అని కనిపిస్తుంది. లేదా +91తో ప్రారంభమై అదనంగా పదంకెల నంబర్ ఉంటుంది.

 

దీనిపై www.sancharsaathi.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయి ‘సిటిజెన్ సెంట్రిక్ సర్వీసెస్’లోని ‘రిక్విన్’ ఆప్షన్ను ఎంచుకొని వివరాలు నమోదు చేయొచ్చు. 1963/1800110420 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీవోటీ స్పష్టం చేస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram