ఎన్సిసి శిక్షణతో దేశభక్తి, క్రమశిక్షణతో సమాజానికి ఆదర్శంగా నిలవాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
గోల్డెన్ న్యూస్ /మణుగూరు : మండల పరిధిలోని మిట్ట గూడెం తెలంగాణ గిరిజన గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్ సి సి క్యాంపు ను జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంప్‌లో శిక్షణ పొందుతున్న ఎన్సిసి క్యాడెట్లతో మాట్లాడుతూ, దేశభక్తి, క్రమశిక్షణ, నిబద్ధత వంటి విలువలను జీవితంలో అలవర్చుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఎన్సిసి శిక్షణ ద్వారా క్యాడెట్లు సమాజానికి ఆదర్శప్రాయులుగా ఎదిగి, దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రస్తుత కాలంలో విద్యతో పాటు జిజ్ఞాస, విమర్శనాత్మక ఆలోచన, సహకారం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్రతి విద్యార్థిలో పెంపొందితేనే భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలబడగలరని తెలిపారు. ఎన్సిసి ద్వారా లభించే అవకాశాలను ప్రతి క్యాడెట్ వినియోగించుకోవాలని , ఈ శిక్షణ ద్వారా సివిల్ సర్వీసులు, రక్షణ రంగం, ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి దోహదం అవుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్సిసి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.కె. భద్ర, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ నవీన్ యాదవ్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రవి బండారుపల్లి, తహశీల్దార్, ఎంపిడిఓ, ఎంపిఓలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.









