గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : మైనారిటీ గురుకులాల్లోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్టం ఉద్యోగులు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే సాకుతో ఏకంగా వారి వేతనాలను సర్కారు కుదించింది. జేఎల్‌కు 35 వేల నుంచి 23,400, పీజీటీలకు 31,395 18,2005, టీజీటీలకు 28,660 18,2005 తగ్గించింది. టీచర్ల జీతాన్ని పెంచాల్సింది పోయి అడ్డంగా తెగ్గోసి ఉపాధ్యాయుల జీతాలను 30 నుండి 40 శాతం తగ్గిస్తూ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోపై ఉపాధ్యాయ సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో సంవత్సరాలుగా రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా కృషి చేస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న తమకోసం ప్రోత్సాహం ఇవ్వాల్సిన పరిస్థితిలో, అకస్మాత్తుగా జీతాలు తగ్గించడం అన్యాయమని వారు వాపోయారు. అంతేకాక, ఇప్పటికే రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను ఎటువంటి సమాచారం లేకుండా కోతపెట్టి జమ చేయడం విస్మయానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలను పెంచాల్సిన అవసరం ఉందని, కానీ కోత విధించడం అమానుషమని పేర్కొన్నారు. వెంటనే పాత జీతాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి కొత్త జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో మైనారిటీ ఔట్సోర్సింగ్ సిబ్బంది ప్రతినిధులు, ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ రీజినల్ సెక్రటరీ మొహమ్మద్ ముజీబ్‌తో కలిసి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఖమ్మంలోని వారి కార్యాలయంలో కలిసి సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి, అంశాన్ని పరిశీలించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.









