బస్ ఛార్జీల పెంపుపై స్పందించిన టీజీఎస్ఆర్టీసీ.. 50 శాతం బాదుడుపై క్లారిటీ

హైదరాబాద్‌: బస్సు ఛార్జీలను 50 శాతం పెంచారన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) ఖండించింది. సాధారణ ప్రయాణికులకు వర్తించే టికెట్ ధరలు యథాతథంగానే కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.

 

 

ఆర్టీసీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ధరల పెంపు కేవలం పండుగల సమయంలో నడిపే ప్రత్యేక సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన అనంతరం, బస్సులు ఖాళీగా తిరిగి రావడం వల్ల కలిగే డీజిల్ వ్యయాన్ని భరించడానికి మాత్రమే ఈ సవరణ అమలులో ఉంటుందని తెలిపారు.

 

 

ఈ విధానం 2003లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 16 ప్రకారం అప్పటి నుంచి అమల్లో ఉన్నదని అధికారులు గుర్తుచేశారు. సోషల్ మీడియాలో, కొన్ని ఇతర మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఖండించిన ఆర్టీసీ, ప్రజలు అలాంటి అపోహలను నమ్మవద్దని కోరింది.

 

 

సాధారణంగా నడిచే పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, గరుడ, సూపర్ లగ్జరీ సహా అన్ని సర్వీసుల్లో ప్రస్తుత చార్జీలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. భవిష్యత్తులో మార్పులు ఉంటే అధికారిక ప్రకటన ద్వారానే తెలియజేస్తామని ఆర్టీసీ వెల్లడించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram