ఇద్దరు పిల్లల రూల్‌ను ఎత్తివేసేందుకు త్వరలోనే ఆర్డినెన్స్‌

ఇద్దరు మించి సంతానం ఉన్న వారు పోటీ చేయరాదన్న నిబంధన తొలగింపునకు కసరత్తు – రేపు కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీకి అడుగులు – రానున్న ఎన్నికల్లోనే అమలుకు అవకాశం – ఆర్డినెన్స్‌ బిల్లుపై సీతక్క సంతకం.

 

ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను ఎత్తివేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

ఈ మేరకు ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు పైన మంగళవారం నాడు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం అయిన తర్వాత క్యాబినెట్‌ ముందుకు రానుంది. ఆర్డినెన్సు బిల్లును క్యాబినెట్‌ ఆమోదించిన తర్వాత గవర్నర్‌ వద్దకు పంపనున్నారు. గవర్నర్‌ ఆ బిల్లును ఆమోదిస్తే…

 

వచ్చే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 21(3) ప్రకారం ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు గ్రామీణ స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు. 1995కు ముందు ఇద్దరు మించి పిల్లలు ఉన్న వారికి మాత్రం సడలింపు ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలవుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయాలంటూ కొంత కాలంగా స్థానిక నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

 

ఇటీవల రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో ఈ అంశంపైన చర్చించింది. ఆ నిబంధనను ఎత్తివేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. కానీ, ఈ నిర్ణయం అమల్లోకి రావాలంటే తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018కు సవరణ చేసి అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. శీతాకాలం అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఇంకా సమయం ఉండటం, హైకోర్టు ఆదేశాల మేరకు త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో చట్ట సవరణను ఆర్డినెన్సు రూపంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు గురువారం రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆ భేటీలో పంచాయతీరాజ్‌ చట్ట సవరణ ఆర్డినెన్సును రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించి.. గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపనుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram