కళ్ల ముందే కుప్పకూలిన హెలికాప్టర్.. !
రష్యాలో నలుగురు దుర్మరణం.. ముగ్గురికి గాయాలు
మృతుల్లో యుద్ధ విమానాల విడిభాగాల తయారీ కంపెనీ సిబ్బంది
గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
రష్యాలో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ఒకటి కూలిపోయింది. యుద్ధ విమానాల విడి భాగాలు తయారు చేసే కంపెనీకి చెందిన సిబ్బందితో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తూ ఓ ఇంటిపై కూలింది. దీంతో మంటలు ఎగిసిపడగా.. హెలికాప్టర్ లోని ఏడుగురు ప్రయాణికుల్లో నలుగురు సజీవ దహనమయ్యారు. మిగిలిన ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం..దక్షిణ రష్యాలోని డాగేస్తాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని రష్యా మంత్రి యారోస్లావ్ గ్లాజోవ్ తెలిపారు. ఈ హెలికాప్టర్‌లో రష్యాలోని కిజ్ల్యార్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్‌కు చెందిన సీనియర్ సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు. కాగా, సుఖోయ్ మరియు మిగ్ అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్ లకు అవసరమైన గ్రౌండ్ కంట్రోల్ మరియు డయాగ్నస్టిక్ సిస్టమ్స్ ను కిజ్ల్యార్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ తయారుచేస్తుంది.








