గోల్డెన్ న్యూస్/ సంగారెడ్డి / సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్‌పల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సీహెచ్ రాజు (36) తనను నమ్ముకున్న వారే మోసం చేశారని భావిస్తూ తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే నిన్న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విషాదం మరింత పెరిగింది. సీహెచ్ రాజు తన సమీప ప్రత్యర్థిపై కేవలం 9 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు అధికారికంగా వెల్లడైంది. గెలుపు తనదేనని తెలిసేలోపే ఆయన ప్రాణాలు విడిచిపెట్టడం గ్రామస్తులను, పార్టీ శ్రేణులను తీవ్రంగా కలచివేసింది.
ఈ ఘటనపై గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, మద్దతుదారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక చిన్న అపోహ, ఓటమి భయం ఓ ప్రాణాన్ని బలి తీసుకోవడం సమాజాన్ని ఆలోచింపజేస్తోంది.









