తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం గోపురం పైకి వ్యక్తి హల్చల్
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ సంచలనం రేగింది. మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆలయ భద్రతను దాటి లోపలికి ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది గమనించేలోపే ఆలయం గోడను దూకి లోపలకు చేరుకున్న ఆ వ్యక్తి నేరుగా ఆలయ గోపురంపైకి ఎక్కిపోయాడు.
గోపురంపైకి చేరిన అనంతరం అక్కడ ఉన్న కలశాలను లాగేందుకు ప్రయత్నం చేయడంతో అధికారులు, భక్తుల్లో ఆందోళన నెలకొంది. వెంటనే ఆలయ సిబ్బంది అలర్ట్ అయ్యి ఘటన స్థలికి చేరుకుని అతన్ని కిందకు దింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దాదాపు మూడు గంటల పాటు ప్రయత్నాలు చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తెచ్చినట్లు సమాచారం.
సంఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ భద్రతా ఏర్పాట్లపై కూడా సమీక్ష చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో భక్తుల్లో తాత్కాలిక ఉద్రిక్తత నెలకొన్నా, ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.
ఇంకా అధికారిక ప్రకటన, కేసు నమోదు వివరాలు వెల్లడికావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం కాస్త వేచి చూడాలి.









