రూ. 2 కోట్ల బీమా కోసం ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. నిజామాబాద్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.
గోల్డెన్ న్యూస్ / నిజామాబాద్ / నిజామాబాద్‌లో భర్త హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే భర్త పల్లటి రమేష్‌ను భార్య సౌమ్య, ఆమె ప్రియుడు దిలీప్ కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
మృతుడు పల్లటి రమేష్‌పై రూ.2 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఇన్సూరెన్స్ డబ్బులను పొందడంతో పాటు, వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ హత్యకు పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు.
ప్లాన్ ప్రకారం రమేష్‌కు నిద్రమాత్రలు ఇచ్చిన సౌమ్య, అనంతరం గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటనను సహజ మరణంగా చూపించేందుకు గుండెపోటుతో మృతి చెందినట్లు చిత్రీకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అయితే మృతుడి తమ్ముడు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శవానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదికల ఆధారంగా పోలీసులు విచారణను ముమ్మరం చేయగా, సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల కఠిన విచారణలో భార్య సౌమ్య, ఆమె ప్రియుడు దిలీప్ హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.









