వీధి కుక్కలపై విషప్రయోగం.. మంత్రి సీతక్క సీరియస్

కుక్కలను చంపకుండా గ్రామ పంచాయతీలకు మార్గదర్శకాలు జారీ..

కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలకు విష ప్రయోగం చేసి చంపినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.సంబంధిత ఘటనలపై ఇప్పటికే పోలీసు కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నారని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో అమానుషంగా కుక్కలను చంపడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. మూగజీవాలను విషం పెట్టి చంపడం   నేరమని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొన్ని గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయం స్థానిక సర్పంచుల దృష్టికి రావడం సహజమేనని, అయితే ఆ సమస్యకు పరిష్కారం చట్టబద్ధమైన, మానవీయమైన మార్గాల్లోనే చేయాలి తప్ప దారుణమైన నిర్ణయాలు వడికట్ట వద్దనే హితువు పలికారు. వీధి కుక్కల నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకాలు, కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్) వంటి శాస్త్రీయ పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. మూకుమ్మడిగా విషం పెట్టి చంపడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నామని. బాధ్యులపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు..

 

 

 

ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

Facebook
WhatsApp
Twitter
Telegram