మణుగూరులో తొలి శిశువుకు నార్మల్ డెలివరీ,భద్రాచలంలో రెండో శిశువుకు అత్యవసర సిజేరియన్
వైద్య బృందాల సమన్వయంతో క్షేమంగా తల్లి, ఇద్దరు శిశువులు
రోగి క్షేమం కోసం ఆసుపత్రుల మధ్య సమన్వయానికి విశిష్ట ఉదాహరణ
భద్రాచలం: అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మణుగూరు, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య బృందాలు సమన్వయంతో సకాలంలో స్పందించడంతో అధిక ప్రమాదం ఉన్న కవలల గర్భిణికి సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. తల్లి, ఇద్దరు శిశువులు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామానికి చెందిన బి. భీమమ్మ అనే గిరిజన మహిళ (గుత్తికోయ)ప్రసవం కోసం సామాజిక కార్యకర్త సహాయంతో అక్టోబర్ 1న రాత్రి 10 గంటలకు మణుగూరు ఆసుపత్రికి చేరుకున్నారు. ఇది అన్‌బుక్డ్ కవలల గర్భధారణ కేసు. ప్రస్తుత గర్భధారణ సమయంలో ఆమెకు గతంలో ఎటువంటి ఆసుపత్రి సందర్శన, యాంటీనేటల్ చెకప్‌లు లేదా అవసరమైన పరీక్షలు జరగలేదు.
పరీక్షల్లో తీవ్ర రక్తహీనత (Hb 6 గ్రా.%), తీవ్రమైన రక్తపోటు 180/120 mmHgగా నమోదైంది. వైద్యపరంగా ఇది హైరిస్క్ ట్విన్ ప్రెగ్నెన్సీతో పాటు severe pre-eclampsia పరిస్థితిగా గుర్తించారు. ఆమెకు వైద్య బృందం తక్షణ చికిత్స, పర్యవేక్షణ అందించింది.
అనంతరం ప్రసవం పూర్తిగా పురోగమించిన నేపథ్యంలో, మెకోనియం కలిసిన ఉమ్మనీరు ఉండగా అక్టోబర్ 1న రాత్రి సుమారు 11 గంటలకు తొలి శిశువు (మగ)సాధారణ ప్రసవం ద్వారా జన్మించింది. 1.6 కిలోల బరువున్న మగ శిశువు జన్మించగా, శిశువును పిల్లల వైద్య నిపుణుడు పరీక్షించి తక్కువ జనన బరువు (LBW) కారణంగా SNCUలో పర్యవేక్షణ అవసరమని సూచించారు.
మొదటి శిశువు జననం అనంతరం రెండో శిశువు ప్రసవం కోసం సుమారు 30 నిమిషాలు పర్యవేక్షించగా, రెండో శిశువు అబ్స్ట్రక్టెడ్ లేబర్‌లో ఉన్నట్లు గుర్తించారు. అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే మణుగూరు ఆసుపత్రిలో రక్త మార్పిడి కోసం అవసరమైన B+ రక్తం, ICU, SNCU/NICU సదుపాయాలు తగినంతగా అందుబాటులో లేకపోవడంతో, తల్లి తీవ్రమైన రక్తహీనత, అధిక రక్తపోటు, కవలల గర్భధారణ, రెండో శిశువు అబ్స్ట్రక్టెడ్ లేబర్ వంటి ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఉన్నతస్థాయి వైద్య సేవల కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అత్యవసరంగా రిఫర్ చేశారు.
భద్రాచలం ఏరియా ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్య బృందం అత్యవసరంగా LSCS నిర్వహించింది. అక్టోబర్ 2న అర్ధరాత్రి 12.30 గంటలకు రెండో శిశువైన ఆడబిడ్డ 2.2కేజీ జన్మించింది.
ఆసుపత్రుల మధ్య సకాలంలో సమాచార మార్పిడి, సమన్వయంతో కూడిన రిఫరల్, తక్షణ వైద్య స్పందన రోగి ప్రాణాలను కాపాడటంలో ఎంత కీలకమో ఈ ఘటనకు చక్కటి ఉదాహరణగా నిలిచింది.
సకాలంలో రిఫరల్, అత్యవసర శస్త్రచికిత్స, తల్లి–శిశువులకు అవసరమైన వైద్య పర్యవేక్షణతో ప్రస్తుతం తల్లి, ఇద్దరు శిశువులు క్షేమంగా ఉన్నారు.
ఈ కేసులో మణుగూరు నుంచి భద్రాచలానికి సకాలంలో అత్యవసర రిఫరల్, రెండు ఆసుపత్రుల వైద్య, నర్సింగ్, OT బృందాల మధ్య నిరంతర సమన్వయం కీలకంగా నిలిచింది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయం తీసుకోవడం, అవసరమైన ఉన్నతస్థాయి వైద్య సేవలకు తరలించడం ద్వారా తల్లి, ఇద్దరు శిశువులకు సురక్షిత వైద్య సంరక్షణ అందింది.
ఈ సందర్భంగా జిల్లా వైద్య సేవల సమన్వయకర్త డాక్టర్ జి. రవి బాబు మణుగూరు, భద్రాచలం వైద్య బృందాలను అభినందించారు. తీవ్రమైన రక్తహీనత, అధిక రక్తపోటు, కవలల గర్భధారణ, అబ్స్ట్రక్టెడ్ లేబర్ వంటి అనేక ప్రమాదకర అంశాలు ఉన్నప్పటికీ, రెండు ఆసుపత్రుల బృందాలు సమన్వయంతో పనిచేసి సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయమన్నారు.
ఈ కేసులో మణుగూరు ఆసుపత్రి వైద్య బృందం తరఫున డాక్టర్ శ్రీనిధి, డాక్టర్ వంశీ, డాక్టర్ సుప్రియ, నర్సింగ్ సిబ్బంది ఇందిరా,ఆదిలక్ష్మి, శ్రావంతి, మిడ్‌వైఫ్ లలిత సేవలందించారు.
భద్రాచలం ఏరియా ఆసుపత్రి బృందం తరఫున డాక్టర్ పూజ, డాక్టర్ మల్లేష్, డాక్టర్ విజయరావు, డాక్టర్ సాయి కిషోర్ నర్సింగ్ ఆఫీసర్ సైలజ, OT సిబ్బంది కాజా, శివ తదితరులు అత్యవసర వైద్య సేవల్లో పాల్గొన్నారు.
మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యవసర ప్రసూతి సేవలను అందుబాటులో ఉంచుతూ, అవసరమైన సందర్భాల్లో సమీపంలోని ఉన్నతస్థాయి వైద్య కేంద్రాలతో సమన్వయం చేసుకుని తల్లి, శిశువుల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వ వైద్య బృందాలు నిరంతరం కృషి చేస్తున్నాయని అధికారులు తెలిపారు.








