బస్టాండ్ నుంచి కదలని బస్సులు.. క్యూలైన్లో ప్రజలు..
గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల తిరుగు ప్రయాణం నరకప్రాయంగా మారింది. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా బస్టాండ్ ప్రాంగణానికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ఆర్టీసీ అధికారులు ముందస్తుగా సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రయాణికుల రద్దీని తట్టుకోలేక యంత్రాంగం చేతులెత్తేసింది. గంటల తరబడి వేచి చూసినా బస్సులు రాకపోవడంతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోయారు.
ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో బస్టాండ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హనుమకొండ, హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులు లేక వేలాది మంది భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బస్సుల కొరతతో పాటు అధికారులు అందుబాటులో లేకపోవడం భక్తుల్లో అసంతృప్తిని పెంచింది. పోలీసులకు, అధికారులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు.
మేడారం ఆర్టీసీ బస్టాండ్ వేలాదిమంది భక్తులతో కిక్కిరిసిపోయింది. చంటి బిడ్డలతో వచ్చిన తల్లులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.









