ఏడుస్తున్నాడని కారణంతో రెండు నెలల పసికందును పొయ్యిలో వేసిన తల్లి ..తండ్రి ఫిర్యాదుతో తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. పేగు బంధాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే తన రెండు నెలల పసికందు పట్ల ఆర్కశంగా మారింది. ఊరికే ఏడుస్తున్నాడన్న కోపంతో, పసిబిడ్డను మండుతున్న కట్టెల పొయ్యిలోకి విసిరేసింది. ఈ అమానుష సంఘటన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేంద్ర (21), మమత అహిర్వార్ (20) దంపతులు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి బౌరంపేటలోని ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో కార్మికులుగా పనిచేస్తూ, అక్కడే ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. వీరికి రెండు నెలల కుమారుడు ఉన్నాడు.
సోమవారం రాత్రి బాబు ఊరికే ఏడుస్తుండటంతో తల్లి మమత తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఏడుపు ఆపడానికి బాబు నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి, అత్యంత కిరాతకంగా మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసింది. పని ముగించుకుని వచ్చిన తండ్రి రాజేంద్ర.. బాబు కనిపించకపోవడంతో భార్యను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వెతకగా, పొయ్యిలో కాలిపోయిన బాబు మృతదేహం కనిపించింది.
భర్త ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలైన తల్లి మమతను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.









