ఖమ్మం ఇళ్ల కూల్చివేత భాదితులకు కేటీఆర్ భరోసా

ఖమ్మం వెలుగుమట్లలో కేటీఆర్ పర్యటన.

బాధితులను పరామర్శించిన కేటీఆర్.

న్యాయం జరిగే వరకు కొట్లాడుదాం అని భరోసా.

గోల్డెన్ న్యూస్ /ఖమ్మం/ మాజీ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితులతో గురువారం ముచ్చటించారు, వాళ్ళ ఆవేదనను అడిగి తెలుసుకుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీ దగ్గర భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. భూదాన్ అంటే ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. కేటీఆర్ పరామర్శించిన సమయంలో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. బాధితులు తమ కన్నీళ్లను ఆపుకుంటూ, తమ వద్ద ఉన్న భూమి పట్టా కాగితాలు, ప్రభుత్వానికి కట్టిన ఆస్తి పన్ను (Property Tax) రశీదులు, ఇంటి పన్ను కాగితాలు మరియు విద్యుత్ కనెక్షన్ కోసం కట్టిన డీడీలను కేటీఆర్ కి చూపించారు. “అన్నా, ఇవన్నీ ప్రభుత్వమే ఇచ్చిన కాగితాలు కదా, మరి మా ఇళ్లను ఎలా కూలుస్తారు?” అంటూ వారు తమ ఆవేదనను వెళ్లగక్కారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో జీవోల ప్రకారం దరఖాస్తు చేసుకుని, ఎలాంటి ఇబ్బంది లేకుండా నివసిస్తున్న తమను, ప్రస్తుత ప్రభుత్వం అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా ఖాళీ చేయించిందని వారు వాపోయారు.

 

ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ ఆగ్రహం.

 

బాధితుల వద్ద ఉన్న అన్ని రకాల ధృవీకరణ పత్రాలను పరిశీలించిన కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిన “ఇందిరమ్మ రాజ్యం”లో, ఉన్న ఇళ్లను కూలగొట్టడం అన్యాయమని ధ్వజమెత్తారు. ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు మరియు కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, కనీస నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం అమానుషమని ఆయన విమర్శించారు. ఖమ్మంలో 150 ఇళ్లతో పాటు, మహబూబ్ నగర్‌లో దివ్యాంగుల ఇళ్లను కూడా కూల్చివేయడం ఈ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. కేవలం ఆర్డీవోను బదిలీ చేస్తే సరిపోదని, బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

 

బాధితులకు భరోసా మరియు పునరావాస హామీ.

 

కూల్చివేతకు గురైన కుటుంబాలకు కేటీఆర్ అండగా నిలిచారు. మీరు ఎవరూ అధైర్యపడకండి, అండగా ఉంటాం మీ అందరికీ మళ్ళీ ఇదే స్థలంలో ఇళ్లు కట్టించి, గృహప్రవేశాలు చేయించే బాధ్యత నాది” అని ఆయన హామీ ఇచ్చారు. ఈ పోరాటంలో భాగంగా కలెక్టర్ మరియు చీఫ్ సెక్రటరీలను కలిసి బాధితుల పక్షాన నిలబడతామని చెప్పారు. శాసనసభ, శాసనమండలి వేదికలుగా ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పేదల పక్షాన పోరాడాలని కేసీఆర్ గారు ప్రత్యేకంగా చెప్పారని, బాధితులు ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు.

 

న్యాయ పోరాటంపై స్పష్టత.

 

ప్రభుత్వం బాధితులను విడదీసే ప్రయత్నం చేస్తుందని, కానీ అందరూ కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధించగలమని కేటీఆర్ సూచించారు. కలెక్టర్ తమతో అబద్ధాలు చెప్పారని బాధిత మహిళలు ఫిర్యాదు చేయగా, అధికారులు మరియు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడతామని ఆయన భరోసా ఇచ్చారు. చట్టపరమైన అన్ని ఆధారాలు బాధితుల వైపు ఉన్నాయని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ వారికి ధైర్యాన్ని నూరిపోశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram