గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ : ప్రజల అత్యవసర పరిస్థితుల్లో బాధితులు సహాయం కోసం చేసే టోల్ ఫ్రీ నంబర్ల విషయంలో కీలక మార్పులు జరిగాయి. ఇకపై డయల్ 112 నంబర్ అమలులోకి వచ్చినట్లు డీజీపీ జితేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు పోలీస్ సహాయం కోసం 100, అంబులెన్స్ సేవల కోసం 108, మహిళల భద్రత 181, చిన్నారుల భద్రత 1098, విపత్తులకు సంబంధించి 1077 వివిధ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందేవారు. అయితే అత్యవసర సమయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు దేశవ్యాప్తంగా అన్నిటికీ కలిపి ఓకే అత్యవసర నంబర్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలోనే 112 నంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో నేటి నుంచి రాష్ట్రంలో ఇదివరకు ఉన్న ఎమర్జెన్సీ నంబర్ల స్థానంలో 112 ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
ఇకమీదట అన్ని అత్యవసర సేవల కోసం 112 డయల్ చేస్తే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి వెంటనే సంఘటన స్థలానికి అధికారులను పంపించేలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీనిని అమల్లోకి తీసుకొని వచ్చింది. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు.