నగరంలో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభించనున్న సీఎం

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమాల (SRDP) కింద నగరంలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, రోడ్డు విస్తరణలు వంటి చేపడుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. తాజాగా నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది.

 

శేరిలింగంపల్లిలోని శిల్పా లే అవుట్ ఫేస్-2 వద్ద నిర్మించిన కొత్త ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (జూన్ 28న) ప్రారంభించనున్నారు. రూ. 182.72 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 1.20 కిలోమీటర్ల పొడవైన, 6 లైన్ల బై-డైరెక్షన్ ఫ్లైఓవర్ ఇది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుండి కొండాపూర్ వరకు ఇది విస్తరించి ఉంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వైపు వెళ్లే వారికి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇప్పటికే అక్కడ రెండు ఫ్లైఓవర్లు ఉండగా.. వాటి పైన మూడవ స్థాయిలో నిర్మించిన నగరంలోనే ప్రత్యేకమైన నిర్మాణం ఇది.

 

కొత్త ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. రూ. 182.72 కోట్ల అంచనా వ్యయంతో ఓఆర్‌ఆర్ నుండి కొండాపూర్ వరకు 1.20 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ ఇబ్బందులు లేకుండా దూసుకెళ్లవచ్చునని అన్నారు.

 

ఇక ఈ కొత్త ఫ్లైఓవర్ ప్రారంభంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (SRDP)లో భాగంగా మరో కీలక ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram