గౌరవం చిన్నారులకు గౌన్లుగా మారింది.. సన్మానాలకు వచ్చిన శాలువాలతో గౌన్లు కుట్టించిన ఏఎస్పీ..
కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. వివిధ సన్మానాలు, సత్కారాల సందర్భంగా తనకు అందిన శాలువాలతో పేద చిన్నారుల కోసం గౌన్లు కుట్టించి పంపిణీ చేశారు. వేములవాడ పట్టణంలోని బేడ, బుడగ, జంగాల కాలనీల చిన్నారులకు ఈ గౌన్లను ఏఎస్పీ స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ.. తనకు అందిన గౌరవాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని, పేద చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూడటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సన్మానాల సందర్భంగా ఇచ్చే శాలువాలు, కండువాలు వృథా కాకుండా గౌన్లు కుట్టించి చిన్నారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. స్థానికులు ఏఎస్పీ చర్యను ప్రశంసిస్తూ, ఇతరులు కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రేరణ పొందాలని అభిప్రాయపడ్డారు.








