♦ ఆన్లైన్ యాప్‌లతో వేధింపులు తప్పవు
♦11 నెలల్లో 271 ఫిర్యాదులు.. రూ.42లక్షలు పైనే స్వాహా
సులభంగా రుణాలు ఇస్తామంటూ ఆశ చూపిస్తున్న ఇన్స్టంట్ లోన్ యాప్‌ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేస్తున్నప్పటికీ. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎంతోమంది ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, తీవ్రమైన వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలు, ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తక్కువ వడ్డీకే క్షణాల్లో లోన్ మంజూరు చేస్తామంటూ నమ్మించి, వారి వలలో వేసుకుంటున్నారు. రుణం ఆమోదం కోసం ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో ముందుగానే డబ్బులు వసూలు చేయడం లేదా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు..అందుకే కనిపించిన ప్రతి లోన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవద్దని, ముఖ్యంగా ఏపీకే ఫైల్స్‌ను అసలు ఫోన్లో ఇన్స్టాల్ చేయవద్దని పోలీసులు సూచించారు. యాప్‌లకు అనవసరంగా కాంటాక్ట్స్, గ్యాలరీ వంటి పర్మిషన్లు ఇవ్వడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. “చిన్న మొత్తంలో రుణం కోసం మీ విలువైన వ్యక్తిగత డేటాను పణంగా పెట్టవద్దు. రుణం కన్నా మీ డేటా భద్రతే ముఖ్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
వేధింపులు తాళలేక ఇబ్బంది పడుతున్న వారెందరో.
యాప్‌ల ద్వారా జిల్లాలో రుణం పొందిన వారు 11 నెలల్లో దాదాపు 271 మంది ఉన్నా రంటే.. ఎలా మోసపోతున్నారో ఇట్టే అర్థమవుతుంది. ఇక లోను యాప్‌ల ద్వారా లోన్ తీసుకున్న వారు తీసుకున్న డబ్బుల కంటే దాదాపు 42 లక్షల వరకు అధిక వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో లోను యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక చివరికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి లోను యాప్‌లపై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నకిలీ యాప్‌లే ఎక్కువ
తమ అవసరాల నిమిత్తం డబ్బు కోసం సోషల్ మీడియాను కొంతమంది వేదికగా చేసుకుంటున్నారు. అందులో వచ్చే ప్రకటనలకు ఆకర్షితులై లింకులు క్లిక్ చేసి తమ వ్యక్తిగత సమాచారం ఇవ్వడంతో వారి మొబైల్లో ఉన్న డేటాను సైబర్ నేరగాళ్లు కొట్టేస్తారు. మొత్తం మన మొబైల్లో ఉన్న అన్ని కాంటాక్టు నెంబర్లు, ఫొటోలు, డేటాను యాక్సస్ చేసుకుంటారు. ఇది లోన్ తీసుకున్నవారి పాలిట శాపంగా మారుతుంది. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మోసపోయిన బాధితుల్లో కొందరు…
♦ కడపకు చెందిన ఓ యువతి తన అవసరాల కోసం రుణయాప్ ద్వారా రూ.50వేలు తీసుకుంది. తీసుకున్న డబ్బు కంతుల వారీగా చెల్లించింది. అయినా సైబర్ నేరగాళ్లు ఆ యువతినే డబ్బులు కట్టాలంటూ వేధింపులకు గురి చేశారు. తాను తీసుకున్న డబ్బులు కంటే అధికంగా డబ్బులు చెల్లించానని చెప్పినా టార్చర్ పెట్టారు. వాళ్ల టార్చర్ భరించిలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.
♦ కడపకు చెందిన ఓ వ్యక్తి వ్యాపార అవసరాల నిమిత్తం రూ.32లక్షలు ఈ నకలీ యాప్ ద్వారా లోను పొందారు. అయితే అతను తిరిగి డబ్బులు చెల్లిస్తున్నా మిగతా డబ్బులు కూడా కట్టాలని, లేకుంటే నీ ఫొటోలు కాంటాక్టులందరికీ పంపిస్తానని బెదిరింపులకు పాల్పడడంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు.
♦ ప్రొద్దుటూరుకు చెందిన ఓ మహిళ లోను యాప్ ద్వారా రుణం తీసుకుంది. డబ్బులు చెల్లించినప్పటికీ మళ్లీ డబ్బులు కట్టా లని రకరకాల నెంబర్ల నుంచి అతన్ని టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు. ఇలాంటి సైబర్‌నే రాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. అలాగే ప్రజలు కూడా అత్యాశ పడి ఆన్లైన్ యాప్‌ల ద్వారా లోను పెడితే మాత్రం మీ చేతులారా మీరే నష్టపోవాల్సి వస్తుంది..










