చెన్నై-హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రైలును తిరుపతి మీదుగా నడిపేందుకు సవరించిన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అందజేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, 778 కిలోమీటర్ల దూరం కేవలం 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం 12 గంటలు పట్టే ప్రయాణం గణనీయంగా తగ్గుతుంది. తమిళనాడులో 223.44 హెక్టార్ల భూమి అవసరమని నివేదిక పేర్కొంది. చెన్నై సెంట్రల్, మీంజూరు వద్ద కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
దేశంలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు కారిడార్ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను హైదరాబాద్-చెన్నై మార్గంలో నిర్మించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి చెన్నైకి రైలులో వెళ్లడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. అయితే ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పూర్తయితే.. ఈ ప్రయాణ సమయం కేవలం 2 గంటల 20 నిమిషాలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన RITES సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహిస్తోంది. ఇందులో ట్రాఫిక్ విశ్లేషణ, డిమాండ్ అంచనాలు, సర్వేలు వంటివి ఉంటాయి. అనంతరం ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇదే సంస్థ తయారు చేయనుంది.









