ఆన్‌లైన్‌లో నమోదైనందున ఎన్నికలకు ఇబ్బంది లేదంటున్న అధికారులు
గోల్డెన్ న్యూస్/ వికారాబాద్ / మూడు గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలు మాయమైన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చోటుచేసుకుంది. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపిన ప్రకారం గొట్లపల్లి క్లస్టర్‌లో గొట్లపల్లి, గిర్మాపూరు, హన్మాపూరు, జయరాం తండా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు విధులు నిర్వహించిన సిబ్బంది కేంద్రానికి తాళం వేసి వెళ్లారు. అటెండరు రాత్రి 9.30 గంటల వరకు కాపలా ఉండి వెళ్లి పోయారు. అతడు తిరిగి బుధవారం ఉదయం రాగా.. గది వద్ద నామినేషన్ పత్రాలు చిందర వందరగా పడి ఉన్నాయి. అధికారులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. గొట్లపల్లి పంచాయతీ నామినేషన్ పత్రాలు ఉండగా, మిగిలిన పంచాయతీలవి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో రతన్‌సింగ్ మాట్లాడుతూ.. ‘నామినేషన్లన్నీ ఆన్‌లైన్‌లో డిజిటలైజ్ చేశాం. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవు. పత్రాల మాయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’ అని వివరించారు.*









