స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం గణేష్పాడులో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి.
గోల్డెన్ న్యూస్ /ఖమ్మం / ఓ స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం గణేష్పాడులో ప్రమాదం జరిగింది. వేంసూరు మండలం మొద్దులుగూడెంలోని శ్రీ వివేకానంద విద్యాలయం స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. శుక్రవారం సాయంత్రం విద్యార్థులతో వెళ్తున్న బస్సు, గణేష్‌పాడు వద్ద నియంత్రణ కోల్పోయి పంట కాలవలోకి ఒరిగిపోయింది. ఈ ఘటన సమయంలో బస్సులో సుమారు 105 మంది విద్యార్థులు ఉండగా, 20 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే వేంసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించడం, డ్రైవర్ నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










