గోల్డెన్ న్యూస్ / మహబూబాబాద్ / మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న భూక్య సుధాకర్‌పై దాడి చేసిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.
పోలీసుల కథనం మేరకు గత నెల 14వ తేదీన భూక్య సుధాకర్ విధుల్లో ఉండగా, గూడూరు మండలం రాములు తండాకు చెందిన ఆటో డ్రైవర్ Md. షారుక్ తన ఆటోను అజాగ్రత్తగా నడిపి ఆర్టీసీ డ్రైవర్ సుధాకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ విషయమై ప్రశ్నించగా, నిందితుడు ఇష్టానుసారంగా బూతులు తిడుతూ చేతులతో కొట్టి గాయపరిచినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు టౌన్ ఇన్స్పెక్టర్ ఆదేశాలతో ఎస్ఐ Md. అలీం హుస్సేన్ విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఈరోజు నిందితుడు Md. షారుక్‌ను అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు టౌన్ సీఐ వెల్లడించారు.
ప్రజా సేవలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు సహించబోమని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.









