ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ మహిళా మావోయిస్టు మృతి

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్/ ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి చెందింది. మచ్‌పల్లి అడవుల్లో మావోయిస్టులున్నారనే సమాచారంలో కేంద్ర బలగాలు కూబింగ్‌ నిర్వహిస్తుండగా ఎన్‌కౌంటర్‌ జరిగిన ట్లు పోలీసులు తెలిపారు. మరణించిన మావోయిస్టు రూపిరెడ్డిని అలియాస్‌ రంగబోయిన భాగ్యగా గుర్తించామని, మచ్‌పల్లి ఏరియా కమిటీ మెంబర్‌గా పని చేస్తోందన్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండ లం, ధర్మారం గ్రామానికి చెందిన రూపిరెడ్డి 2 దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో పని చేస్తోందని, ఆమెపై ప్రభుత్వం గతంలో రూ. 5 లక్షల రివార్డు ప్రకటించిందని కాంకేర్‌ పోలీసులు వెల్లడించారు. రూపిరెడ్డి భర్త దండకారణ్య స్పెషల్‌జోన్‌ కమిటీ సభ్యుడైన విజయ్‌ రెడ్డి గతేడాది మాన్‌పూర్‌ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. భర్త మరణం తర్వాత రూపిరెడ్డి భద్రతా దళాలపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తోందనే ప్రచారం జరిగింది. చివరకు 8నెలల వ్యవధిలో భర్త మరణించిన ప్రాంతానికి సమీపంలోనే ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు వెంటనే లొంగిపోవాలని బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ సూచించారు. గతంలో డీజీపీ శివధర్‌ రెడ్డి ప్రకటించిన అజ్ఞాతంలో ఉన్న ఐదుగురు తెలంగాణ మావోయిస్టుల జాబితాలో, రూపిరెడ్డి ఒకరు కావడం గమనార్హం.

Facebook
WhatsApp
Twitter
Telegram