గుండాల ఏజెన్సీకి ఫైర్ స్టేషన్ అత్యవసరం ఎమ్మెల్యే

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అత్యంత వెనుకబడిన గుండాల మండలానికి వెంటనే నూతన అగ్నిమాపక కేంద్రం (Fire Station) మంజూరు చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలంగాణ శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు.

 

శాసనసభలో నూతన ఫైర్ స్టేషన్ల ఏర్పాటు అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన గుండాల మండలం ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను సభ దృష్టికి తీసుకువచ్చారు.

 

గుండాల మండలం 99 శాతం ఆదివాసీలు నివసించే వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతమని, అభివృద్ధి, మౌలిక వసతుల పరంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో గాని, పరిసర గ్రామాల్లో గాని అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ ఇంజిన్ రావడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు.

 

ప్రస్తుతం గుండాల మండలానికి  ఫైర్ స్టేషన్లు చాలా దూరంలో ఉన్నాయని, ఇల్లందు నుంచి సుమారు 60 కిలోమీటర్లు,జిల్లా కేంద్రం కొత్తగూడెం నుంచి 90 కిలోమీటర్లు,మణుగూరు నుంచి దాదాపు 130 కిలోమీటర్ల దూరం ఉందని సభకు వివరించిన ఎమ్మెల్యే.

 

 

ఈ దూరభారం కారణంగా ఫైర్ ఇంజిన్ సంఘటన స్థలానికి చేరుకునేలోపే ఇళ్లు, ఆస్తులు పూర్తిగా కాలి బూడిదవుతున్నాయని, గతంలో ఈ కారణంగా భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించిందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గుర్తు చేశారు.

 

పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన గుండాల మండల ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత దృష్ట్యా అక్కడ వెంటనే ఒక నూతన అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖా మంత్రిని శాసనసభ వేదికగా సవినయంగా, స్పష్టంగా కోరారు.

 

ఏజెన్సీ ప్రాంతాలపై ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను గుర్తించి గుండాల మండలానికి ఫైర్ స్టేషన్ మంజూరుపై తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram