శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత

అప్రమత్తమైన అధికారులు

 

హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి మత్తు పదార్థాల కలకలం చోటుచేసుకుంది. అక్రమంగా తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు బుధవారం ఉదయం పట్టుకున్నారు. జనవరి 7న ఫుకెట్ దేశం నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఈ గంజాయిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

 

విమానంలోని సీటు నంబర్లు 16, 17 వద్ద హైడ్రోపోనిక్ గంజాయిని వదిలివెళ్లినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. విదేశాల్లో మట్టి లేకుండా సాగు చేసే ఈ ప్రత్యేక రకం గంజాయి సుమారు ఒక కిలో వరకు ఉన్నట్లు సమాచారం. పట్టుబడిన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

 

తనిఖీలకు భయపడి నిందితులు విమానంలోనే గంజాయిని వదిలివెళ్లి పారిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో విదేశాల్లో సాగు చేసిన హైడ్రోపోనిక్ గంజాయిని భారత్‌కు అక్రమంగా తరలించే ప్రయత్నాలు పెరుగుతున్న నేపథ్యంలో, అధికారులు అప్రమత్తమయ్యారు.

 

ఈ తరహా మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా మరింత కఠినతరం చేసినట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram