సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట నాణ్యమైన భోజనం అందించడం అందరి బాధ్యత విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించము : జిల్లా కలెక్టర్ అంకిత్
గోల్డెన్ న్యూస్ / మణుగూరు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం మణుగూరు మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించి పలు ప్రభుత్వ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు.
మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రిలోని వార్డులు, ఔషధ నిల్వ గది, మందుల సరఫరా విధానం, ఔట్పేషంట్ విభాగం, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల సేవాభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రిలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్ షెడ్, స్టోర్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, బోధన విధానం గురించి తెలుసుకున్నారు. కిచెన్ షెడ్లో ఆహార తయారీ విధానాన్ని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే విషయాన్ని ఆరా తీశారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు మరియు ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారు పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారో అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం ఫలితాల వివరాలు తెలుసుకొని ఈ ఏడాది 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతతో పాటు పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, వారికి నాణ్యమైన ఆహారం అందించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిరి యూనిట్ ద్వారా సరఫరా అవుతున్న చిక్కీలను స్వయంగా రుచి చూసి వాటి నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులకు సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనాన్ని కూడా రుచి చూసి ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలను కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధన విధానం మరియు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. చిన్నారులతో మాట్లాడి వారికి పాఠాలు ఎలా బోధిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే మంచి విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
గుండు సింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం మరియు ప్రభుత్వ గిరిజన మోడల్ ప్రాథమిక పాఠశాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, పోషకాహారం పంపిణీ విధానం, పిల్లల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని వంటగది, స్టోర్ రూమ్, త్రాగునీటి సదుపాయం, పరిశుభ్రత పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, గుడ్లు మరియు ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసి గుడ్ల పరిమాణాన్ని పరిశీలించారు. పిల్లలకు అందించే పోషకాహారం మెనూ ప్రకారం సమయానికి అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలు, ఆటపాటల ద్వారా బోధన విధానాన్ని కూడా పరిశీలించారు. పిల్లలకు పోషకాహారం నాణ్యంగా, పరిశుభ్రంగా అందేలా, కేంద్రం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనినా, ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి, వైద్యులు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ఉపాధ్యాయులు విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.










