గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ హైదరాబాద్ నగరంలో జరిగిన జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌లో పేకాట ఆడేందుకు డబ్బుల కోసం ఒక కారు డ్రైవర్ వరుసగా ఇద్దరు వృద్ధురాళ్లను దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44 ప్రాంతంలో ఓ వైద్యుడి ఇంట్లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వాసు అనే వ్యక్తి ఈ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడి డబ్బుల కోసం పన్నిన పథకంతో ఈ దారుణాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
గత నెల 11న యాదమ్మ అనే వృద్ధురాలిని కారులో లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఎక్కించుకున్న నిందితుడు, అనంతరం ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారం తీసుకున్నాడు. ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన రూ.26,500తో ఆన్‌లైన్‌లో పేకాట ఆడినట్లు విచారణలో వెల్లడైంది. అయితే ఆ డబ్బులు పూర్తిగా పోగొట్టుకున్న తర్వాత మళ్లీ డబ్బుల కోసం మరో నేరానికి పాల్పడ్డాడు.
దీంతో గత నెల 14న మంగమ్మ అనే మరో వృద్ధురాలిని కూడా అదే విధంగా కారులో ఎక్కించుకుని హత్య చేశాడు. అనంతరం రెండు సంఘటనల్లోనూ శవాలను పట్టపగలే కారులో తీసుకెళ్లి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని మోకిల ప్రాంతంలో పారేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఫిలింనగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు..









