ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు

విద్యార్థులకు 48 రోజుల పాటు విశ్రాంతి 

 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పాఠశాలలు ఒంటిపూట విధానంలో కొనసాగుతున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది.

 

ఈ సంవత్సరం మార్చి నెల మొదటి వారంనుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యం, భద్రత కోసం ముందుగానే సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు మొత్తం 48 రోజులపాటు వేసవి సెలవులు ఉండనున్నాయి.

 

జూన్ 12 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. అదే రోజు నుంచి 2026–2027 విద్యా సంవత్సరం అధికారికంగా ప్రారంభం కానుంది. వేసవి సెలవులు ప్రకటించడంతో పట్టణాల్లో చదువుకుంటున్న విద్యార్థులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగానే సెలవులు ప్రకటించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

విద్యా సంవత్సరం చివరి రోజుల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయట తిరగకుండా ఉండాలని విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించింది.

 

అలాగే వేసవి సెలవుల సమయంలో పిల్లలు సముద్రాలు, నదులు, చెరువులు, సరస్సులు, కుంటలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు నిరంతర పర్యవేక్షణలో ఉంచాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram