2030 నాటికి భూమి రికార్డు స్థాయి వేడి ఖాయం? 

ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక

 

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చనున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ సంచలన హెచ్చరిక జారీ చేసింది. 2030 నాటికి ప్రపంచం రికార్డు స్థాయి వేడి సంవత్సరాన్ని చూసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ముఖ్యంగా 2026 నుంచి 2030 మధ్యకాలంలో కనీసం ఒక సంవత్సరం ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలను అధిగమించే అవకాశం 86 శాతం ఉందని అంచనా వేసింది.

 

ప్రపంచ వాతావరణ సంస్థ తాజా నివేదిక ప్రకారం, గత పదేళ్లలోనే ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 2024, 2025 సంవత్సరాలు అత్యధిక వేడి నమోదైన సంవత్సరాలుగా నిలవగా, రాబోయే కాలంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ తీవ్ర వేడికి ప్రధాన కారణాలుగా శిలాజ ఇంధనాల (బొగ్గు, చమురు, వాయువు) అధిక వినియోగం వల్ల పెరిగిన కార్బన్ ఉద్గారాలు, అలాగే ఎల్‌నినో వాతావరణ ప్రభావంను ప్రపంచ వాతావరణ సంస్థ గుర్తించింది. వాతావరణంలో హరిత గృహ వాయువులు పెరగడంతో భూమి సహజ ఉష్ణ సమతుల్యత దెబ్బతింటోందని నిపుణులు చెబుతున్నారు.

 

భారత్‌పైనా తీవ్ర ప్రభావం?

 

ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగితే భారత్ సహా అనేక దేశాల్లో వడగాల్పులు, నీటి కొరత, పంటల నష్టం, అడవి అగ్నిప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

‘ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ప్రమాదమే’

 

కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. పునరుత్పాదక ఇంధనాల వినియోగం పెంచడం, అడవుల సంరక్షణ, కాలుష్య నియంత్రణ వంటి చర్యలు అత్యవసరమని పేర్కొంది.

 

“ప్రకృతి హెచ్చరిస్తోంది.. కానీ ప్రపంచం వినిపించుకుంటుందా?” అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Facebook
WhatsApp
Twitter
Telegram