ఆశా డే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. తుకారామ్ రాథోడ్
గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం / మణుగూరు, జగన్నాధపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. తుకారామ్ రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణలో ఆశాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులైన అంతర ఇంజెక్షన్, ఛాయ మాత్రలు, మాలా-ఎన్, మాలా-డి, నిరోధ్ వంటి సేవలను అర్హులైన దంపతులకు అందించాలని సూచించారు. పిల్లల మధ్య తగిన విరామం (Spacing) ఉండేలా ప్రోత్సహించాలని తెలిపారు.
గర్భిణీలలో అధిక ప్రమాద లక్షణాలు ఉన్న గర్భిణులను (High Risk ANC) ముందుగానే గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేయాలని, గర్భిణీలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. మాతృ మరణాల రేటు (MMR) మరియు శిశు మరణాల రేటు (IMR) తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
సాధారణ ప్రసవాలను పెంచి, అవసరం లేని సిజేరియన్ శస్త్రచికిత్సలను తగ్గించే దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రతి గర్భిణికి సమయానికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రజలు సమతుల్య ఆహారం (Balanced Diet) తీసుకోవాలని, “Eat Right – Stay Healthy” అనే సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలని సూచించారు. వేసవి కాలంలో వడదెబ్బ (Sunstroke) బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రోజుకు సరిపడా నీరు త్రాగాలని, మధ్యాహ్న వేళల్లో అవసరం లేనప్పుడు బయట తిరగవద్దని సూచించారు.
ప్రతిరోజూ నడక (Walking), యోగా, వ్యాయామం చేయడం ద్వారా మంచి ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆరోగ్య, వెల్‌నెస్ కార్యకలాపాలు (Health & Wellness Activities) నిర్వహించి ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించాలని సూచించారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలని, పరిశుభ్రత పాటించాలని కోరారు. వర్షాకాలంలో విరేచనాల వ్యాధుల నివారణకు ప్రభుత్వం చేపడుతున్న స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.
అలాగే జూన్ 28 వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలను పూర్తిగా గుర్తించి, ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాలికలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని, అర్హులైన బాలికలకు టీకాలు అందేలా చూడాలని సూచించారు.
ప్రస్తుత వర్షాకాలం మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు, శ్వాసకోశ వ్యాధులు మరియు విరేచనాల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డా. తుకారాం రాథోడ్ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమల నివారణ చర్యలు పాటించడం, తాగునీటిని మరిగించి లేదా శుద్ధి చేసి వినియోగించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ఏవైనా జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్య సేవలు పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు Dr ప్రతాప్ Dr హరీష్ హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.








