గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / 50 ఏండ్లుగా కొనసాగుతున్న లంబాడాల రిజర్వేషన్ దోపిడీపై రాజీలేని పోరాటాలు కొనసాగిస్తాం – తుడుం దెబ్బ పాకాల కొత్తగూడలో గుంజేడు ముసలమ్మ సాక్షిగా నిర్వహించిన “పోరుకేక విజయోత్సవం – రాష్ట్ర కమిటీ సమీక్షా సమావేశం”లో తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తీసుకున్న చారిత్రాత్మక తీర్మానాలకు కరకగూడెం మండల ఆదివాసి సమాజం మరియు తుడుం దెబ్బ నాయకత్వం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలెబోయిన వెంకటనారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 50 ఏండ్లుగా కొనసాగుతున్న లంబాడాల రిజర్వేషన్ దోపిడీ కారణంగా కోయ, గోండ్, ప్రధాన్, కొలాం, చెంచు, నాయకపోడ్ తదితర మూలవాసి ఆదివాసి తెగలు విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను కోల్పోతూ తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్ కుమార్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం సుధాకర్ నాయకత్వంలో* జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివాసి హక్కుల పరిరక్షణ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.
లంబాడా రిజర్వేషన్ వివాదం – ప్రధాన డిమాండ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1976-77 కాలంలో లంబాడాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చిన ప్రక్రియపై ఆదివాసి సమాజంలో అనేక సందేహాలు, అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత యాభై ఏండ్లుగా మూలవాసి ఆదివాసీలకు చెందాల్సిన విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు ఇతర వర్గాల చేతిలోకి వెళ్లాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర అధ్యయనం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జూన్ 30లోగా ఆదివాసీల
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 30లోగా ఆదివాసీల సమస్యలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని, కమిటీని ఏర్పాటు చేసి చట్టబద్ధమైన పరిష్కార మార్గాన్ని సూచించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తుడుం దెబ్బ ఆధ్వర్యంలో భారీ ప్రజా ఉద్యమాలు నిర్వహించనున్నట్లు హెచ్చరించారు.
రాష్ట్ర కమిటీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ
● జూన్ 26 – ఆదివాసి ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఎన్నికలు – నర్సంపేట.
● జూన్ 30 – హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజా సంఘాలు, సామాజిక కులాలతో లంబాడాల సమస్యపై రౌండ్ టేబుల్ సమావేశం.
● జులై 11, 12 – భద్రాచలంలో “రేలా పాట మువ్వల సవ్వడి” సాంస్కృతిక కార్యక్రమం.
● జులై 31 – కుమురం భీం పోరాట గడ్డ ఆసిఫాబాద్‌లో లక్ష మందితో మహాసభ.
● ఆగస్టు 1 నుండి 30 వరకు – వంటావార్పులు, మౌన ప్రదర్శనలు, జలదీక్షలు, రాస్తారోకోలు, అర్థనగ్న ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు.
● సెప్టెంబర్ 13 – మణుగూరులో ఆదివాసి మహిళల బహిరంగ సభ.
● అక్టోబర్ 8 – ఆదివాసి ఉద్యోగ మహాసభ.
● నవంబర్ 9 – ఆదివాసి విద్యార్థి, యువజన, నిరుద్యోగుల “గోదావరి ప్రాంత గోస” లక్ష మంది బహిరంగ సభ.
● డిసెంబర్ 9 – తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా భారీ బహిరంగ సభ.
దీర్ఘకాలిక ఉద్యమ వ్యూహం
తుడుం దెబ్బ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ కేవలం ఒక రోజు నిరసన కార్యక్రమం కాదని, జూన్ నుండి డిసెంబర్ వరకు కొనసాగే సుదీర్ఘ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమ ప్రణాళిక అని తెలిపారు.
ఉద్యోగులు, మహిళలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలన్నింటినీ ఉద్యమంలో భాగస్వాములను చేయడం ద్వారా ఆదివాసి హక్కుల సాధన కోసం సమగ్ర పోరాటాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
సాంస్కృతిక పోరాటం కొనసాగుతుంది
పాకాల కొత్తగూడ, గుంజేడు ముసలమ్మ ప్రాంగణం, భద్రాచలం, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాలు ఆదివాసి చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీకలని తెలిపారు. ఈ నేపథ్యంలో రేలా పాటలు, జానపద కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్తామని వెల్లడించారు.
ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఆదివాసి సమాజంలో పెరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన, చట్టబద్ధమైన పరిష్కారాన్ని చూపాలని కోరారు. ఆదివాసీల విద్య, ఉద్యోగ, రాజకీయ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
జల్ – జంగల్ – జమీన్ మా హక్కు
నీరు, అడవి, భూమిపై ఆదివాసీల సహజ హక్కులను కాపాడుకోవడం, ఆదివాసి అస్తిత్వాన్ని రక్షించడం, రాజ్యాంగబద్ధ హక్కులను సాధించడం కోసం తుడుం దెబ్బ ఆధ్వర్యంలో జరిగే ప్రతి ఉద్యమ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పోలెబోయిన వెంకటనారాయణ పిలుపునిచ్చారు.








