ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి

⇒పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

⇒వలస గిరిజనులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి

⇒తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు మీడియం బాబురావు

 

గోల్డెన్ న్యూస్ / పినపాక /  గిరిజన సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు మీడియం బాబురావు పిలుపునిచ్చారు. గురువారం పినపాక మండలం ఈ బయ్యారంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండల మహాసభ నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ మీడియం బాబురావు ముఖ్య అతిథిగా హాజరై గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల పరిరక్షణ, పోడు భూముల అంశాలపై మాట్లాడారు.మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు, మహిళలు, యువకులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.మహాసభకు ముందు సీతారాంపురం గ్రామం నుంచి ఈ బయ్యారం క్రాస్‌రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది గిరిజనులు సంప్రదాయ వేషధారణలో పాల్గొని తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కొమ్ము నృత్యాలు, జానపద కళారూపాలను ప్రదర్శించారు. డప్పుల మోతలు, సంప్రదాయ గీతాల నడుమ సాగిన ఈ ర్యాలీ స్థానిక ప్రజలను ఆకట్టుకుంది. గిరిజనుల ఐక్యత, సామాజిక చైతన్యాన్ని చాటిచెప్పే విధంగా ర్యాలీ కొనసాగింది.

ర్యాలీ అనంతరం ఈ బయ్యారం క్రాస్‌రోడ్‌లోని కొమరం భీం విగ్రహం వద్దకు చేరుకున్న గిరిజనులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన కొమరం భీం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పోరాటాలను కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం దుబ్బ గోవర్ధన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మహాసభలో గిరిజనుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మీడియం బాబురావు రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోడు భూముల సమస్య ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం కాకపోవడం వల్ల వేలాది గిరిజన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలు అందించి భూ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.గిరిజనులు నివసించే ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ఇంకా అందుబాటులోకి రాలేదని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాల వరకు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన గ్రామాల్లో రహదారులు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఆరోగ్య సేవలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.వలస గిరిజనుల సమస్యలపై కూడా మీడియం బాబురావు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉపాధి, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన గిరిజనులు తమ గిరిజన హోదాను కోల్పోరని స్పష్టం చేశారు. వారు ఎక్కడ నివసిస్తున్నారనే కారణంతో కుల ధ్రువీకరణ పత్రాలు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. అర్హులైన వలస గిరిజనులకు వెంటనే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గిరిజనుల భూమి, అటవీ, నీటి హక్కులను పరిరక్షించేందుకు సంఘటిత పోరాటాలు అవసరమని మీడియం బాబురావు పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడానికి గిరిజనులు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

మహాసభలో గిరిజనుల హక్కుల సాధన, పోడు భూముల సమస్యల పరిష్కారం, వలస గిరిజనులకు న్యాయం కల్పించే అంశాలపై పలు తీర్మానాలు ఆమోదించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా దుబ్బా గోవర్ధన్, మండల కార్యదర్శిగా మడివి రమేష్, తో కూడిన కమిటీని ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు గౌరీ నాగేశ్వర రావు, కార్యదర్శి కారం పుల్లయ్య,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల వెంకన్న, మండల నాయకులు కల్తీ నాగేశ్వర రావు, కూరసం లక్ష్మయ్య, నూపా కృష్ణ , వివిధ గ్రామాల ప్రతినిధులు,ఆదివాసి మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram