వరంగల్ నగరంలో పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల బయటపడిన ఘటన తీవ్ర కలకలం రేపింది
గోల్డెన్ న్యూస్ / వరంగల్ / వరంగల్‌లోని ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో రఘునందన్ అనే వ్యక్తి పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి ప్యాకెట్‌ను తెరిచిన సమయంలో అందులో ఎలుక పిల్ల కనిపించడంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే సంబంధిత దుకాణానికి వెళ్లి విషయం గురించి ప్రశ్నించగా వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది.
అనంతరం బాధితుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఫిర్యాదు ఆధారంగా పెరుగు తయారీ సంస్థకు చెందిన అదే బ్యాచ్‌కు సంబంధించిన ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఎలుక పిల్ల బయటపడిన ప్యాకెట్లోని నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి తెలిపారు.
ప్రాథమిక విచారణలో తయారీ, ప్యాకేజింగ్ లేదా నిల్వ ప్రక్రియల్లో లోపాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ల్యాబ్ నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. సంబంధిత పెరుగు తయారీ కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుండగా, ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. వినియోగదారులు ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో తయారీ తేదీ, గడువు తేదీ, ప్యాకెట్ స్థితిని తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.








