బాలికల సదనంలో మేజిస్ట్రేట్ ఆకస్మిక తనిఖీ

బాలికల సదనంలో మేజిస్ట్రేట్ ఆకస్మిక తనిఖీ

చిన్నారుల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

 

మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్, ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి శనివారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం బాలికల సదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 

ఈ సందర్భంగా సదనంలోని గదులు, వంటగది, ఆవరణ, పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో మేజిస్ట్రేట్ ముచ్చటించి భోజనం, వైద్యం, విద్య, తాగునీరు, భద్రత తదితర సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసి అవసరమైన వైద్య పరీక్షలను సకాలంలో నిర్వహించాలని సదనం నిర్వాహకులకు సూచించారు.

 

చిన్నారులు చదువుపై శ్రద్ధ పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని మేజిస్ట్రేట్ సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే సదనం నిర్వాహకులు, సంబంధిత అధికారులు లేదా న్యాయ సేవా సంస్థల దృష్టికి తీసుకురావాలని, బాలల హక్కుల పరిరక్షణకు న్యాయ సేవా సంస్థలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపారు.

 

సదనంలో చిన్నారులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పిస్తూ వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం బాలికలకు మేజిస్ట్రేట్ స్వయంగా భోజన పదార్థాలను వడ్డించి, ఆహారం రుచిగా ఉందా అని అడిగి తెలుసుకున్నారు.

 

ఈ కార్యక్రమంలో సదనం చైల్డ్ వెల్ఫేర్ అధికారిణి దీప్తి రాణి, న్యాయవాది అంకం సర్వేశ్, లీగల్ సెల్ కోఆర్డినేటర్ రవీందర్, సదనం అసిస్టెంట్ కుమారి, కోర్టు కానిస్టేబుల్ బుచ్చిబాబు, హోంగార్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram