బీసీ మహిళలారా.. కుట్టుమిషన్ కోసం ఇదే చివరి అవకాశం!

September 30తో దరఖాస్తుల గడువు ముగింపు.. 100 శాతం సబ్సిడీతో ఉచిత కుట్టుమిషన్లు

 

హైదరాబాద్ : తెలంగాణలో బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, ఆర్థికంగా సాధికారత సాధించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మరో నాలుగు రోజులే మిగిలాయి. అర్హులైన మహిళలు సెప్టెంబర్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

ఈ పథకం కింద అర్హత సాధించిన మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఉచితంగా కుట్టుమిషన్లు అందించనున్నారు. తొలి విడతలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 మంది చొప్పున మొత్తం 1.19 లక్షల మంది మహిళలను ఎంపిక చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

 

18 నుంచి 55 సంవత్సరాల వయస్సు ఉన్న బీసీ మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండటం కూడా అర్హతల్లో ఒకటిగా పేర్కొన్నారు.

 

పేద మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన, అర్హతల నిర్ధారణ అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

 

భారీగా దరఖాస్తులు

 

ఈ పథకానికి ఇప్పటికే మహిళల నుంచి భారీ స్పందన వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. లక్ష్యానికి మించి దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో అర్హులైన మహిళలను నిబంధనల ప్రకారం పరిశీలించి ఎంపిక చేయనున్నారు.

 

సెప్టెంబర్ 30 చివరి తేదీ కావడంతో అర్హత ఉన్న బీసీ మహిళలు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram