గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడి రూ.21 లక్షల విలువైన ఆస్తులు, బ్యాంక్ ఖాతా జప్తు..
ఎస్పీ అభినందన.
భద్రాద్రి కొత్తగూడెం : ప్రభుత్వం నిషేధించిన గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి రవాణా చేస్తూ పట్టుబడిన నిందితుడి ఆస్తులను, అతని భార్య బ్యాంక్ ఖాతాను ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా జప్తు చేసినట్లు ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. తేదీ 28.08.2025న ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో నమోదైన Cr.No.136/2025, U/Sec 8(C) r/w 20(b)(ii)(C), 27(A), 29 of NDPS Act-1985 కేసులో నిందితుడు పల్లపు రఘు అక్రమ గంజాయి రవాణా ద్వారా సంపాదించినట్లు గుర్తించిన ఆస్తులపై ఆర్థిక దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడి పేరుతో ఉన్న రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్, అలాగే అతని భార్యకు సంబంధించిన బ్యాంక్ ఖాతాను చెన్నై కాంపిటెంట్ అథారిటీ ద్వారా ఫ్రీజింగ్ ఆర్డర్ పొందిన అనంతరం, గౌరవ న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు జప్తు చేసినట్లు సీఐ వెల్లడించారు. జప్తు చేసిన ఆస్తులు, బ్యాంక్ ఖాతా విలువ మొత్తం సుమారు రూ.21,15,907/-గా ఉన్నట్లు తెలిపారు. ఆస్తులు జప్తు చేయబడిన నిందితుడి వివరాలు: పల్లపు రఘు, S/o ఎల్లయ్య, వయస్సు 35 సంవత్సరాలు, వృత్తి: కారు డ్రైవర్, స్వస్థలం: మండేపల్లి గ్రామం, చిన్నకోడూర్ మండలం, సిద్దిపేట జిల్లా. ప్రస్తుతం ఉప్పల్, హైదరాబాద్లో నివాసం.
గంజాయి అక్రమ కొనుగోలు, రవాణా వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు, నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేసేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిని అరెస్టు చేయడమే కాకుండా, నేరం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేసేలా సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టిన ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.









