దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సామగ్రి పంపిణీ

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిలకలగుంపు మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్తూరు పాఠశాలల విద్యార్థులకు ఖమ్మం జిల్లాకు చెందిన దాతలు ఆయుర్వేద వైద్యులు డా. కాళహస్తి వెంకటేశ్వరరావు, ఎన్‌ఆర్‌ఐ (అమెరికా) శ్రీ వి.వి. యేసు రెడ్డి, కె. సూర్యనారాయణ, బి. బావ సింగ్ సంయుక్తంగా నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఒక సౌండ్ బాక్స్‌ను విరాళంగా అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మంజుల, అనంతారం కాంప్లెక్స్ హెచ్‌ఎం సీహెచ్. వసంతరావు, చిలకలగుంపు, కొత్తూరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ సీఆర్‌పీ విష్ణు, వై. సర్వేశ్వరరావు, కె. సూర్యనారాయణ, బి. బావ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

మండల విద్యాశాఖ అధికారి మంజుల మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైన ఖమ్మం జిల్లా దాతలకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram