జీవో నం.3ను పునరుద్ధరించాలి – 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలబోయిన వెంకటనారాయణ
గోల్డెన్ న్యూస్ //కరకగూడెం // ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరకగూడెం మండల కేంద్రంలో తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలబోయిన వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టుపల్లి గ్రామంలోని ఆదివాసీ వీరుడు కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, హక్కులు, రాజ్యాంగ పరిరక్షణలు మరియు ఆదివాసీ ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాలపై నాయకులు అవగాహన కల్పించారు.
నాయకులు మాట్లాడుతూ… ఆదివాసీ సంస్కృతి అనేది కేవలం ఒక సమాజానికి సంబంధించినది కాదని, అది భారతదేశ ప్రాచీన వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగమని అన్నారు. తరతరాలుగా ఆదివాసీలు తమ భూమి, అడవి, నీరు, ప్రకృతి వనరులను కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. వారి సంప్రదాయ జీవన విధానాన్ని, ఆచారాలను, భాషలను, పండుగలను, కళలను కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యతతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, PESA చట్టం–1996, అటవీ హక్కుల చట్టం–2006 వంటి చట్టాలు ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కీలకమైనవని తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామసభలకు కల్పించిన అధికారాలను గౌరవిస్తూ పాలన సాగించాలని, ఆదివాసీల భూమి, అటవీ హక్కులు మరియు సహజ వనరులపై వారి హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా 1/70 భూ బదలాయింపు నిబంధనలను కఠినంగా అమలు చేసి ఆదివాసీల భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా రెవెన్యూ, గిరిజన సంక్షేమ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
జీవో నం.3 పునరుద్ధరణకు ఉద్యమిస్తాం
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ యువతకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో న్యాయం జరిగేలా జీవో నం.3ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని నాయకులు స్పష్టం చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
ఆదివాసీల హక్కులను కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, PESA గ్రామసభల నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆదివాసీ భూములు మరియు వనరులను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివాసీల హక్కులు, సంస్కృతి, ఆత్మగౌరవం, భూమి–అడవి–నీటి పరిరక్షణ కోసం తుడుం దెబ్బ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని నాయకులు తెలిపారు.
“ఆదివాసీ సంస్కృతి మన వారసత్వం – ఆదివాసీ హక్కులు మన బాధ్యత – రాజ్యాంగ చట్టాల అమలు మన పోరాటం” అనే నినాదంతో ఆదివాసీ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.









