గోల్డెన్ న్యూస్/ బూర్గంపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు ఒక అటవీ శాఖ అధికారి ప్రాణాలను తీసుకున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బూర్గంపాడు మండలం నకిరేపేట గ్రామం చెరువు సింగారం వెస్ట్ బీట్ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసరుగా విధులు నిర్వహి స్తున్న నవీన్ అనే అధికారి విధుల నిమిత్తం వెళ్లిన సమయంలో అడవి జంతువుల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ ఉచ్చులో ప్రమాదవశాత్తు చిక్కుకోవడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆయనను 108 అంబులెన్స్ ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరిం చినట్లు సమాచారం. కరెంట్ ఉచ్చు ఎవరు అమర్చారు? ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో అధికారి నవీన్ ఈ ఉచ్చులో చిక్కుకున్నారు? అనే అంశాలపై అటవీ శాఖ, పోలీస్ అధికారులు లొకేషనన్ను పరిశీలించి పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.










