– రాజ్యాంగ విలువలు, ప్రాథమిక విధులను తెలుసుకోవాలి
– క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో భవిష్యత్తును దెబ్బతీసుకోవద్దు
మణుగూరు మెజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి
గోల్డెన్ న్యూస్ / మణుగూరు / విద్యార్థులు చదువుతో పాటు రాజ్యాంగ విలువలు, ప్రాథమిక విధులు, తమ హక్కులు, బాధ్యతలు, బాలల రక్షణకు అమలులో ఉన్న చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని మణుగూరు మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్, ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి సూచించారు.
శనివారం మణుగూరులోని తెలంగాణ గిరిజన సంక్షేమ ఉన్నతీకరించిన రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలికలు)లో నిర్వహించిన న్యాయ అవగాహన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు దేశ సమగ్రతను కాపాడటం, ఇతరులను గౌరవించడం, ప్రజా ఆస్తులను పరిరక్షించడం వంటి ప్రాథమిక విధులను కూడా నిర్దేశించిందని వివరించారు.
బాలలకు విద్య, భద్రత, గౌరవప్రదమైన జీవనం హక్కులని, వారిపై హింస, వేధింపులు, దోపిడీ జరిగినప్పుడు చట్టపరమైన రక్షణ పొందవచ్చని తెలిపారు. బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం బాలికకు 18 ఏళ్లు, బాలుడికి 21 ఏళ్లు నిండకముందు వివాహం చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. బాలలను ప్రమాదకరమైన పనుల్లో నియమించడం, వారి చదువుకు ఆటంకం కలిగేలా శ్రమకు గురిచేయడం చట్టరీత్యా నేరమని వివరించారు.
పోక్సో చట్టం కింద 18 ఏళ్లలోపు బాలబాలికలకు లైంగిక వేధింపులు, దాడులు, అసభ్య ప్రవర్తన నుంచి ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. తమకు ఎదురయ్యే వేధింపులను భయంతో దాచకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా విశ్వసనీయ పెద్దల దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని సూచించారు.
అనంతరం మణుగూరు న్యాయవాదులు పలు చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. టీనేజ్‌లో భావోద్వేగాలు, క్షణికావేశం ప్రభావంతో తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి చట్టపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని వివరించారు. ఆ వయసులో తాము భావించేదే సరైనదనే భ్రమకు లోనుకాకుండా, ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బాధ్యతగల పెద్దల సలహా తీసుకోవాలని సూచించారు.
చిన్న వయసులో చేసే పొరపాటు చదువు, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున భావోద్వేగాల కంటే విచక్షణ, పరిపక్వతతో వ్యవహరించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురు కృష్ణ, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వీరంకి పద్మావతి, న్యాయవాదులు సావిత్రి, నరసింహారావు, భాస్కర్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ రాణి, ఎంఎల్ఎస్సీ కోఆర్డినేటర్ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.









